హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సమీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లలో అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బుధవారం సింగరేణిలో ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నేతలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను సింగరేణి యాజమాన్యం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సంస్థ పరిధిలోని అన్ని ఏరియాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.
కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టాలని చెప్పారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. సంస్థలో అందరూ ఒకే కుటుంబంలా పనిచేస్తున్నారని అన్నారు. అన్ని వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. నియామకాలు, ప్రమోషన్లలో అర్హులకు ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూగర్భ గనుల్లో కష్టమైన పనులు చేస్తున్న లైన్మెన్, కోల్ కట్టర్, సపోర్ట్మెన్, టింబర్మెన్ తదితర కార్మికులకు ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు రూపొందించాలన్నారు.
